ప్రథమ దశమి నాడు యమ పట్న మందు
ఇంద్రాది దేవతలు సభ చేసిరంత
సభలోన శ్రీకృష్ణ స్వామి కూర్చుండే
భేరికీ జామాయె ఆజ్ఞ ఇమ్మనిరి
అడిగిరి దూతలట యముని తోను
అడిగిన వారికి ఆజ్ఞలు ఇచ్చి
సూతులు పలికెను సనకాదులకును
గరుడ వాహన మెక్కి శ్రీ కృష్ణుడపుడు
శీఘ్రమే ఏతెంచె సుభద్ర కడకు
చెల్లెలా వ్రతములు ఏమి నోచితివి
ఏమేమి వ్రతములు ఆచరించితివి
గోవిందుడా నీ వంటి అన్న ఉండంగా
చెప్పరా శ్రీ కృష్ణ దేవ నాతోను
గోపద్మమనియేటి వ్రతము స్త్రీలకునూ
పూర్వ కాలమునందు ఎవరు చేసిరి
మునులు చేసిరి వారు ఋషులు చేసిరి
అజ్ఞాత వాసాన ద్రౌపది చేసే
లక్ష్మి మొదలగు స్త్రీలు చేసిరి
ఏ మాసమందు ఏ పక్ష మందు
ఏ దేవుని పూజ ఇది ఏమి దేవ
ఆషాడ శుద్ధ ఏకాదశి మొదలు
కార్తీక శుద్ధ ద్వాదశి దాకా
చాతుర్మాస్యల నాలుగు నెలలు
వ్రతము చేసి కృష్ణ ప్రతిమను తెచ్చి పూజించి లెస్స
గోశాల యందు తులసి వన మందు
గోమయము తో అరుగు కొమరొప్ప అలికె
పంచ వన్నెల ముగ్గు పద్మమ్ము పెట్టి
గదను పద్మము గరుడ వాహనము
అరటి స్థంభాలచే మంటపం బెట్టి
అరవై ఆరు వత్తుల దీపము బెట్టి
అందులో కలశము స్థాపన చేసి
ధూప దీప నైవేద్యము పెట్టి
ఐదేండ్ల వాయనం సుభద్ర ఇచ్చే
ఐదు రూపులతో అచ్చుతుడు పొందే
అచ్చుతుడు తానాయె అన్న తానాయే
బ్రాహ్మణుడు తానాయె బ్రహ్మ తానాయే
క్షీర సాగర మందు శేషు తానాయె
హౌమమ్ము దగ్గరా పొగ చూసి వారు
మరలి పోయి చెప్పిరి ఆ యమునితోను
ద్వారమ్ము ముందర ఐరావతమ్ము
ప్రాణమ్ము సరి పడా పది ఉన్నదని చెప్పగా
దాని చర్మం తెచ్చి భేరి వేయించి
కృష్ణ హే కృష్ణ హే కృష్ణుడూ జగతి
నాథుడూ యేలేటి నారాయణుండు
గరుడ హే గరుడ హే గరుడ వాహనుడు
కాళీయ మర్దనా కాచి రక్షించు
అజ్ఞాన తిమిరాలనటు బాపి తొలగు
సుజ్ఞాన బ్రహ్మము చూపి రక్షించు
పాప బంధాలను బాపి రక్షించు
శరణార్థి కిందికి చేర్చుకో కృష్ణ
నీ పుణ్య చరణాల నను దయ చేయు
ఎక్కువ శ్రీ కృష్ణ ఏమి నిన్ను అడగ
చక్కగా వైకుంఠ పదవి నాకిమ్ము
అంత్య కాల మందు ఆ సమయమందు
ఆది నారాయణా స్మరణ నాకు దయ చేయా
నా మీద పారేటి పాపాలు అన్నీ పార ద్రోలుము పరమాత్మ కృష్ణా
పోయెను పాపాలు పొందు పుణ్యములు
ఈ పాటను ఎవరు పాడిన విన్న కానీ సకల సౌభాగ్యము సంపదలు కలుగు
Comments
Post a Comment