1. చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువ కాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినుర వేమా.

2. ఆత్మ శుద్ధి లేని యాచారమదియేల?
బాండాశుద్ధి లేని పాకమేల,
కొంచెమైన నదియు కొదువ కాదు
చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా?
విశ్వదాభిరామ వినుర వేమా.

3. గంగిగోవుపాలు గంటెడైనను చాలు
కడివెడైననేమి ఖరముపాలు,
భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు,
విశ్వదాభిరామ వినుర వేమా.

4. నిక్కమైన మంచినీలమొక్కటిచాలు,
దళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల,
చాటుమిలను చాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమా.

5. మిరపగింజచూడా మీద నల్లగనుండు
గొరికిజూడ లోనజుఱుకు మనును
సజ్జనులగువారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినుర వేమా.

6.మృగదంబుజూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమా.

7.మేడిపండుచూడ మేలిమై యుండు
పొట్టవిప్పిచూడ పురుగులుండు
పిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమా.

8. నెరనన్నవాడు నెరజాణ మహిలోన
నేరునన్నవాడు నిందజెందు
ఊరుకున్నవాడే యుత్తమయోగిరా,
విశ్వదాభిరామ వినుర వేమా.

9. గంగ పారునెపుడు గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోడ
పెద్ద పిన్న తనము పేర్మియీలాగురా,
విశ్వదాభిరామ వినుర వేమా.

10. నిండునదులు పారు నిలిచిగంభీరమై
వెర్రి వాగు పారు వేగంబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా,
విశ్వదాభిరామ వినుర వేమా.

11. అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కుజల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమా.

12. కులములోన నొకండు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణముచేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమా.

13. పూజకన్నా నెంచ బుద్ధిప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగులు గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినుర వేమా.

14. ఉత్తముని కుడువున నోగు జన్మించిన
వాడు జెఱచు వాని వంశమెల్ల
జెఱకు వెన్నుపుట్టి చెరపదా తీపెల్ల?
విశ్వదాభిరామ వినుర వేమా.

15. కులముల్లోన నొకడు గుణహీనుఁడుండిన
కులము చెడును వాని గుణమువలన
వెలయజెఱుకునందు వేనువెడలినట్లు
విశ్వదాభిరామ వినుర వేమా.

16. రాముడోకఢుపుట్టి రవికుల మీడేర్చే
కురుపతి జనియించి కులముజేరచే
ఇలను బుణ్యబాప మీలాగు కాదోకా
విశ్వదాభిరామ వినుర వేమా.

17. హీన గుణమువాని ననిలుసేర నిచ్చిన
ఎంతవానికైనా నిడుము గలుగు
ఈగ కడుపుజొచ్చి ఇట్టిట్ట సేయదా
విశ్వదాభిరామ వినుర వేమా.

18. వేరుపురుగుచేరి వృక్షంబుజెరచును
చీడ పురుగు జేరి చెట్టుచేర్చు
కుత్సితుండు చేరి గుణవంతుజెరచురా
విశ్వదాభిరామ వినుర వేమా.

19. అల్పుడెన్ని విద్యలభ్యసించిన గాని
ఘనుడుగాడు హీన జనుడేగాని
పరిమళముల మోయ గార్దభము గజమౌనె
విశ్వదాభిరామ వినుర వేమా.

20. విద్యలేనివాడు విద్యాధికుల చెంత
నుండినంత పండితుండుకాదు
కొలని హంసలకడం గొక్కెర ఉన్నట్లు
విశ్వదాభిరామ వినుర వేమా.

21.అల్పజాతి వాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల దొలగజేయు
చెప్పుందినెడి కుక్క చెరుకు తీపెఱుగునా
విశ్వదాభిరామ వినుర వేమా.

22.అల్పుడైనవాని కధిక భాగ్యముగల్ల
దొడ్డవారి దిట్ఠి దొలగొట్టు
అల్పజాతి మొప్పె యధికుల నెఱుగునా
విశ్వదాభిరామ వినుర వేమా.